Tuesday, 2 August 2011

అమ్మ మళ్లీ పుడుతుందా?

ఎంతో సంపాదించాను. నాకే గుర్తులేదు ఎంత సంపాదించానో. ఎంతో ఎదిగాను. అడుగులకు మడుగులు ఒత్తే దాసీ జనంతో సహా, ప్రపంచమంతా నా గొప్పతనానికి నీరాజనం పలుకుతున్నారు. భార్య పిల్లలు, హోదా అంతస్తు అన్ని వున్నాయి. కాని ఎందుకో తెలియదు, ఈ మద్య నిద్ర పట్టడం లేదు. ఏదో భయం. ఆకలి వేయటం లేదు, ఏదో అశాంతి.   మనసుకు కుదురు లేదు.

నాకు బాగా తెలుస్తూంది, నాకు నిజమైన ప్రేమ కావాలి. కాని నా చుట్టూవున్న అందరూ నా స్థితిని ప్రేమిస్తున్నారు. నాకు బాగా గుర్తు, నా చిన్నతనములో నేను మలమూత్రముల్లో పాకుర్తుంటే నన్ను ఎత్తుకొని ప్రేమగా అమ్మ  ముద్దు పెట్టుకొనేది.


నాకు ఆకలిగా వుంది. నా చుట్టూ పంచ భక్ష్య పరమన్నములు వున్నా, నాకు తినాలినిలేదు .అమ్మ వొడిలో అమ్మ రొమ్ము కుడుస్తూ కడుపునింపిన ఆ పాల రుచి ఈ తిండి లో లేదు. నా చుట్టూ ఎందఱో కాపలా కాస్తున్నా నాకు ఏదో తెలియని భయం, అభద్రత. అమ్మ పొత్తిళ్లలో ఆదమరచి నిదురించిననాటి ప్రశాంతత కావాలి కాని నాకు ఇప్పుడు. అది దొరకదు. ఎందుకంటే పశువు కంటే హీనముగా ప్రవర్తించి అమ్మను పోగొట్టుకున్నాను నేను. 


నేడు నా తప్పు తెలుసుకున్నాను. అమ్మ కంటే, అమ్మ ఒడి కంటే, అమ్మ పాలకంటే గొప్పది ఏదీ లేదన్న గొప్ప సత్యాన్ని గ్రహించాను. ఎందరో ఉన్న ఏకాకిని, అష్టైశ్వర్యాలు ఉన్న బికారిని, అమ్మనూ, అమ్మ ప్రేమనూ దూరం చేసుకున్న అనాధని.


ఒక్కమారు దేవుడు కరుణించి అమ్మను మళ్లీ పుట్టిస్తే, నిరుటి వసంతం మళ్లీ విరియునే, కరడు గుండెను చలనమొచ్చునే, కారుఛీకటిని కాల్చివేయునే, నా జీవితం నాకు దక్కునే! కానీ..
అమ్మ మళ్లీ పుడుతుందా?




.